Friday, 10 April 2015

కాణిపాక వరసిద్ధి వినాయక ఆవిర్భావం                            శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
                ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 
                అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
                అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే.
******************************************************
                          ఒక్కనిమిషం-
               ''నిను తలచినంతనే నాతనువేమో జల్లుజల్లనేరా" అంటారు త్యాగయ్య శ్రీరాములవారితొ.అలాగె శ్రీ కాణిపాక వరసిద్ధివినాయకులవారిని తలచుకుంటే నాకూ అలా అన్పిస్తుంది.నా చిన్ననాటినుండి స్వామివారిని ఎవరి ప్రేరణ లేకుండా కొలవడం అలవాటు నాకు.స్వామిని దర్శించినపుడంతా మనస్వామి ఆవిర్భావాన్నిగురించి విన్నది వ్రాసి ముద్రించి, అందరికి అందించాలని ఆశపడేవాడిని.ఆ ఆశ ఆశగానే ఉండిపోయింది.ఇప్పుడు అందరికి అంతర్జాలం అందుబాటులోకి వస్తోంది.కనుక ఒక బ్లాగ్ తెరచి,స్వామీ
ఆవిర్భావం గురించి పెద్దల ద్వారా  విన్నది మీకు అందించి ఆనందపడుచున్నాను.దేనికైనా కాలం కలిసి రావాలంటారు అందుకేనేమో! 
                వినాయకస్వామి ఆవిర్భావం గురించి మా గురువు శ్రీ కాణిపాకం లింగన్నగారు  'వినాయకవిజయం' అన్నపుస్తకంలో 'కాణిపాకంలో గణపతి' అనే శీర్షికతో వ్రాసియున్నారు. అలాగే శ్రీ సి.నారాయణస్వామిగారు 'కాణిపాకక్షేత్ర ప్రాశస్త్యం' అన్న పుస్తకం వెలువరించి యున్నారు.శ్రీ మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి గారు (గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ ద్వార) ఒకపుస్తకం వెలువరించియున్నారు. ఇంకా అనేక చోట్ల మీరు వినియుండవచ్చు,చదివి యుండవచ్చు. నీవెందుకు రాశావు? అని అడగవచ్చు మీరు.
               భగవంతుని గురించి ఎందరు వ్రాసినా అవి తరిగేవి కాదు.పెరిగేవి, తరింపజేసేవి. అందుకే వ్రాశాను.అయితే ఈ కథలో నేను చేసిందల్లా- మన స్వామిని వెలికితీసి, మనకు ఇంతటి భాగ్యాన్నికల్గించిన ఆ మూగ, చెవిటి సోదరులకు పేర్లు లేకపోవడం ఇష్టంలేక వారికి 'గణపతి, గజపతి' అని పేర్లు పెట్టాను.అలాగే స్వామిని ప్రతిష్టించిన సాధువుకు 'ఈశ్వరానందులు' అని పేరు పెట్టాను.స్వామి తలకు గునపం(గడ్డపార) తగిలి రక్తం ప్రవహించినట్లు చెబుతున్నా, అలా వ్రాయడానికి నా మనసంగీకరించలేదు. అలా అనుకుంటేనే మన మనసు చెదురుతుంది.అందుకే కొబ్బరినీళ్ళతో కాణి పారినట్లువ్రాశాను.తల్లిగర్భం నుండి శిశువు వచ్చినట్లు, మన వినాయకుడు పుడమితల్లి ఉదరంనుండి ఆవిర్భవించినందున, శిశు సమానుడని భావించి "బుజ్జి బొజ్జయ్య" అని పేరు
పెట్టాను.ఈపేరు మనసుకు తట్టిన క్షణంలో నాకెంతో ఆనందం కల్గింది.  మరి ఆనాడు బొజ్జయ్యను వెలికితీసినవారు ఎంత ఆనందం అనుభవించారో! ఒక్క నిమిషం అని ఈ ముందుమాటను ఎక్కువగా వ్రాశానేమో!
           ఇక ముందుకు వెళ్ళండి.చదవండి.చదివి తరించండి.వరసిద్ధి వినాయకస్వామీ కృపకు పాత్రులుకండి.
                                                                 ఇట్లు,
                                                          భగవత్ సేవాభావంతో,
                                                                                  అర్తల ఋష్యేంద్రపతి రెడ్డి,
                                                                               జిల్లేడుపల్లె  గ్రామం, చిత్తూరు జిల్లా.
******************************************************
                                       బుజ్జి బొజ్జయ్య

                                    (కాణిపాక వరసిద్ధి వినాయక ఆవిర్భావం)

                        అది పున్నమిరోజు. వెండి వెన్నెల వెదజల్లుతోంది జాబిల్లి. వెండికరిగి ప్రవహిస్తున్నట్లు తెల్లగా సన్నటి పాయలు పాయలుగా ప్రవహిస్తున్నది విహారపురి ప్రక్కన ఏరు(బాహుదానది).వెన్నెల్లో హాయిగా నిద్రిస్తున్నట్లు ఇసుక తిన్నెలు.ఏటికిరువైపులా పుడమితల్లి పచ్చనిచీర కట్టుకున్నట్లు పచ్చని పైర్లు.
                       ఏటికి ఉత్తరంగా విహారపురిలో ఎక్కడో ఒక కోడి కూసింది.వరుసగా అక్కడో కోడి, ఇక్కడో కోడి కూయడం ప్రారంభించాయి.ప్రశాంత వాతావరణంలో వేకువను తెల్పుతూ నాదస్వరాలూదినట్లుంది కోళ్ళ కూతలు.కళ్ళాపిజల్లి, ముగ్గులు వేయడానికి స్త్రీలు, కపిల కట్టడానికి,ఏతం కొట్టడానికి  వెళ్ళడానికి  పురుషులు నిద్ర లేస్తున్నారు. 
                     పుట్టుకతో మూగవాడైనప్పటికి చెవులు బాగా వినిపిస్తాయి గణపతి కి. చాలాసేపటినుండి కోళ్ళకూతలు వింటూనేఉన్నాడు గణపతి.కూత వింటూనే మేల్కొన్నగణపతి పైకి లేవలేదు. చెదిరిన తన కల గురించి ఆలోచిస్తున్నాడు.ఎప్పుడో పుడుతూనే పోగోట్టుకున్నఅమ్మ,పెంచి పెద్దచేసి తమకో బ్రతుకుతెరువు చూపిన అయ్య కనిపించారు కలలో.అయ్య ఏదోచెప్పాడు. అదేంటో గుర్తుకురావటంలేదు.అయినా ఒక్కటిమాత్రం నిజం.అమ్మో,అయ్యో కలలో కన్పించినపుడు ఏదో ఒక మంచిజరగడం ఇప్పటికే అనుభవం. ఈరోజు ఇద్దరూ కన్పించారు కలలో. 
                         'ఈ పాడు కోళ్ళు మంచికలను పాడుచేసాయి' అని మనసులోనే విసుక్కున్నాడు.ఎంత ఆలోచించినా గుర్తురానందున సరేలే అనుకొని,గుడిసె వెలుపలికి వచ్చాడు.తూర్పు వైపున వేగుచుక్కను చూసాడు. "అరెరె చుక్కబుట్టి ఎంత పైకొచ్చేసిందే'' అనుకొని తిరిగి గుడిసెలోపలికెళ్ళాడు. బుడ్డీదీపం వెలిగించాడు గణపతి.
                        గజపతి ని ఊపిఊపి నిద్రలేపాడు.     గణపతికి మూగయితే.గజపతికి చెవుడు.అందువల్ల గజపతిని ఊ ఊ అంటూ ఊపి నిద్రలేపడం గణపతికి అలవాటు."బాయిదగ్గరికెళ్ళి ఏతం కొట్టాలిగదా.ఇప్పుడే యాలయిపోయింది.పొద్దెక్కిపోతే ఎండగదా" అన్నట్లు సైగలతో చెప్పాడు గణపతి. సరేలే అంటూ,కళ్ళు వేళ్ళతో తుడుచుకొని పైకి లేచాడు గజపతి.ఏతం
బానెత్తుకొని ఇద్దరూ బయలుదేరారు ఏటిగట్టుకు.
                  ------------------------------------------------------
                        గజపతి, గణపతి అన్నదమ్ములు. అమ్మ అమడల్నికని,అనారోగ్యంతో సెలవు తీసుకున్నది.అయ్య ఎముకలు గుల్లజేసుకొని ఇద్దరినీ పెంచి,పెద్ద చేశాడు.మూగవాడిని,చెవిటివాడిని తనకిచ్చి
వెళ్ళినందుకు ఆ అయ్య ఎప్పుడూ తన పెనిమిటిని విసుక్కోలేదు. "ఇదంతా
భగవంతుడిలీల" అనుకొని, బిడ్డలకు తల్లిలేని లోటు తెలియకుండా పెంచాడు.
తనబిడ్డలు ఇతరులపై ఆధారపడి బతగ్గూడదనే గొప్పఆశయంతో,వారిని కష్టించి పనిచెయ్యడంలో దిట్టల్నిచేశాడు.కూలి చేసుకుంటూ ఏటిగట్టున
కొంతనేలలో రాయిరప్పా సుద్దిజేసి పంటలకుయోగ్యం చేసుకున్నాడు.ఏటిగట్టున చిన్నబాయి(గుంత) త్రవ్వి ఎతంకొట్టి పంటలు పండించుకోనేవాడు.
                          అనారోగ్యం పాలైన అయ్య ఒకరోజు - "నేనూ మీ అమ్మదగ్గరికి పోతావుండాను. కలిసిమెలిసి కష్టపడి పన్జేసుకొని బ్రతకండి."
అని ఆశీర్వదించి కన్నుమూశాడు. అయ్యజూపిన మార్గంలో బ్రతుకుబండి లాగుతున్నారు అన్నదమ్ములు.
           -------------------------------------------------------------- 
                            "దినావు ఇంకా ముందే లేస్తావుంటివి గదా! ఈపొద్దు ఏమయ్యింది" అనిప్రశ్నించాడు గజపతి.  ముందుగానే మేల్కొన్నానని,
తన ఆలస్యానికి కారణం అయిన కలగురించి సైగలతో వివరించాడు గణపతి.
"అమ్మ,అయ్య కన్పించారా? ఏంచెప్పారో గుర్తుకు రావడం లేదా? ఐతే మల్లా
ఈపొద్దు రాత్రికి కన్పిస్తే అడుగుడువులే" అంటూ తమాషా చేశాడు గజపతి.
గజపతి తమాషా చేసినా, గణపతి మాత్రం పొలం దగ్గరికి నడుస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు.
                            గజపతి ఏతం తొక్కుతున్నాడు. గణపతి ఏతంబానతో
నీరుతోడి పోస్తున్నాడు.పనికి కాస్త ఆలస్యంగా వచ్చినందున జోరుగా సాగుతోంది పని."సద్దాళకంతా మడి పారిపోవాల.లేదంటే ఎండెక్కిపోతుంది"
అనుకొని ఒకరిపైఒకరు పోటీపడి పనిచేస్తున్నారు.  అలలు చేసుకుంటూ కాలువ పొర్లుతూ పరుగులు తీస్తున్నది నీరు .జోరుగా ఏతం కొట్టినందున బావిలో నీరు కాస్త తొందరగాఅయిపోయింది.నిళ్ళూరినతర్వాతే  ఏతం. ఏటిగట్టుగనుక తొందరగానే ఊరుతుంది.
                         గజపతి ఏతంకొయ్యపైనుండి దిగి,పక్కనే ఉన్నపారతీసి నూతిలోకి విసిరి, అడుగున ఉన్న అడుసుతీసి మిట్టకు వేయమన్నాడు. గణపతి పారతో గబగబా మన్ను ఎత్తిస్తుంటే, గజపతి దానిని
అందుకొని దూరంగా విసిరేస్తున్నాడు.
                -------------------------------------------------------
                  అల్లంత దూరంలో మామిడివృక్షం క్రింద ఈశ్వరానందులవారు
ధ్యానంలో ఉన్నారు. దర్భలపై జింకచర్మము.దానిపై కాషాయ వస్త్రము.
వస్త్రముపై ఉత్తర దిక్కుగా కూర్చొని ఉన్నారు. కాషాయవస్త్రములు ధరించి,విబూది పూసుకొన్నశరీరంతో,మెడలో రుద్రాక్షలతో,పెరిగినగడ్డం,తలపై
జడలుగట్టిన జుట్టుతో ఆకర్షణీయంగా ఉన్నారు. శిరమును,కంఠమును స్థిరముగా నిలిపి పద్మాసనంలో ధ్యానం చేస్తున్నఈశ్వరానందులవారు అప్పుడే ఉదయిస్తున్నబాలభానుడిలా వెల్గొందుతున్నారు.
                    ఏ ఊరెళ్ళినా ఒకటి రెండు రోజులకుమించి ఉండని స్వాములవారు విహారపురికి వచ్చి పదిరోజులు మించిపోయింది.తనను ఇక్కడ కట్టిపెడుతున్నది ఇక్కడి వాతావరణమా? లేక మరేదైనానా? 
రోజూ నదిలో స్నానం, వృక్షంక్రింద ధ్యానం. "ఇక్కడేదో మహత్కార్యం జరగబోతున్నది" అని స్పష్టసంకేతం అందుతున్నది ధ్యానంలో. ఈరోజు మరింత స్పష్టంగా ఉన్నదా సంకేతం. "కొద్ది క్షణాల్లో ఇక్కడే బాల వినాయకుడు ఉద్భవిస్తాడు.స్వామిని ప్రతిష్టించి ప్రజలకు శుభం కలుగజేయడం నీ కర్తవ్యం" అని తన ఆత్మతనకు ప్రభోదం అందించింది. ఇప్పుడు ఈశ్వరానందులవారికి అంతా తేటతెల్లం అయ్యింది. ఈ ఊరువిడిచి
వెళ్ళాలి అనుకున్నప్పుడు, తన మనసు తననెందుకు ఆపిందో, ఈ చోట ధ్యానంలో ఎందుకంత ఏకాగ్రత, ఉత్సుకత కన్పిస్తున్నాయో అర్థమయింది. తన ఇన్నేళ్ళ సాధనకు ఇంతకన్నాగొప్పఫలం మరేంకావాలి? భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు తనపై ఇంతగా ప్రసరించినందుకు స్వాములవారి ఆనందానికి అంతేలేదు.
               --------------------------------------------------
                  బావిలో మన్ను తీస్తున్న గణపతి పారకు ఎదోరాయితగిలి ఖణేల్
మని శబ్దంవచ్చింది. రాయిచుట్టు గబగబా మన్నుతీసి పక్కకు వేశాడు.అప్పటికే ఆరాయి మునిగేటంత నీరూరింది. పారను ప్రక్కనపెట్టి రెండుచేతులతో రాయిని పైకిలాగే ప్రయత్నం చేశాడు. వెంటనే తన శరీరమంతా జిల్లుమనిపించింది. ఇంతవరకు ఎరుగని అనుభూతి. వేకువన గుర్తుకురాని కల ఇప్పుడు గుర్తుకు వచ్చింది. "రేయ్ గణపతి, ఈపొద్దు మనబాయిగుంతలో ఒక రాయి కనిపిస్తాది. అది మామూలు రాయి అనుకోవద్దు.దేవుడురా దేవుడు. దాన్ని భద్రంగా బయటికిదీసి,పక్కనేఉండ్లా స్వాములోరుఆయనకు జెప్పు. సరేనా" అన్నాడు అయ్య కలలో.
                  అద్భుతం జరిగిపోయింది. గణపతికి మాటలు వచ్చేశాయి.
"దండాలు సామి,దండాలు సామి" అంటున్నాడు.                         గట్టుపైనున్నగజపతి ఆశ్చర్యపోతున్నాడు-వీడు మాట్లాడుతున్నట్లుందే అని.
అసలేమి మాటలు రావడం లేదు-అమితాశ్చర్యం వల్ల గజపతికి.
"రేయ్ గజపతి మనబాయిలో దేవుడ్రా. నేనుచెప్పల అయ్య కలలో ఏదో
సెప్పాడని, అదేరా ఇది. సరేగాని నువ్వుఏతం తొక్కు ఇసయం జెప్తా" అంటూ
సైగచేసాడు.(గణపతికి మాటలు వస్తున్నట్లు గజపతికి అర్థమవుతున్నదిగాని
వినిపించదు గదా) ఆనందంతో,ఆశ్చర్యంతో గబగబా ఏతం కొట్టారు ఇద్దరు. నీరైపోతూనే వేగంగా బావిలోకి దిగాడు గజపతి.  రాయి చుట్టూ ఇద్దరూ తమ
చేతులతో మట్టి తీస్తున్నారు. ఇంతలో మరో అద్భుతం. గణపతి చేతులు ఆ
శిలకు తగుల్తూనే శరీరం పులకరించింది.వెంటనే తనకు చెవులు
వినిపిస్తున్నాయి.
 "నాకు చెవులు వినబడతా ఉండాయిరా" గట్టిగా అరిచాడు గజపతి.
 మట్టి తీసి నీటితో కడుగతూ "ఇనాయకసామిరా" రెట్టించిన ఉత్సాహంతో
అరిచాడు గణపతి.
ఇద్దరు జాగ్రత్తగా ప్రక్కన మట్టిదీసి బుజ్జిగణపతి విగ్రహాన్నిపైకి తీసి, కడిగి,
గట్టుపైకి తెచ్చారు.
 '' ఈ ఇనాయకసామిని ఒళ్ళోబెట్టుకోని కూచ్చోరా. నేనుబుయ్యి ఆ చెట్టుకిందున్న సాములోర్నిబిల్చుకోనొస్త'' అంటూ పరుగుతో వెళ్ళాడు గణపతి. 
ఈశ్వరానందులవారిముందు నమస్కరిస్తూ వినయంగా నిలుచుకున్నాడు- పలకరించడానికి భయపడి.
అలికిడివిన్న స్వాములవారు, అందుకోసమేవేచిఉన్నట్లు మెల్లగా కళ్ళు తెరిచారు.విషయం తనకు ధ్యానంలో తేటతెల్లంఅయినప్పటికీ, ఏమిటన్నట్లు తలూపారు.
"మా బాయిలో ఇనాయకసామి ఇగ్రహం దొరికింది సామి. దాన్నిపట్టుకుంటానే నాకు మాటలు వచ్చేసినాయి. నాతమ్మునికి చెవులు 
వినబడతాఉండాయి" అంటూ ఆత్రుతతో,ఉత్కంఠతో చెప్పాడు గణపతి.
తన చేతితో గణపతి తలపై నిమురుతూ చిరునవ్వుతోఆశీర్వదించారుస్వామి.
జరిగిన విషయమంతా వేగంగా వివరిస్తున్నాడు గణపతి. ఇద్దరూ బావిదగ్గరికి
వచ్చారు.
విగ్రహాన్ని స్వాములవారికి అందించాడు గణపతి. చిన్నిగణపతి విగ్రహం ఎంత
ముద్దుగా ఉందో! మహదానందంతో, భక్తిభావంతో, తనజన్మ ధన్యమైనట్లు
కళ్ళకద్దుకున్నారు స్వామి. ఆనందబాష్పాలు రాలుతున్నాయి.
"ఈవిషయాన్నంతా ఊరివారికి చెప్పిరా" అంటూ గజపతిని పంపారు. గంతులేస్తూ చిన్నపిల్లాడిలా పరుగందుకున్నాడు గజపతి ఊరివైపు.
"ఆ గన్నేరుపువ్వులు కోసుకురా నాయనా" అన్నారు గణపతితో.
ఏటిలో తేటగా ప్రవహించే నీటిలో కడిగారు స్వామిని ఈశ్వరానందులు.
గణపతి పూలు తేగా, బావిదగ్గరే ఈశ్వరతనయుడైన "బుజ్జి బొజ్జయ్య" ను
తూర్పు ముఖంగా ఉంచి తొలిపూజ నిర్వహించారు ఈశ్వరానందులు.
                  కొద్దిసేపటికే గ్రామప్రజలంతా గుంపులుగుంపులుగా అక్కడికి
చేరుకున్నారు. వారిలో ఆగ్రామానికే చెందిన ఒక  అంథవ్యక్తిని చూశారు 
ఈశ్వరానందులు. ఆవ్యక్తి అందరిమాటలు వింటున్నాడు.అయితే తాను దేవుణ్ణి చూడలేకపోతున్నాననే దిగులు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది.
 భగవంతుని మహాత్మ్యాన్ని లోకానికి చూపాలనుకున్నారో లేక ఆ అభాగ్యునికి చూపు ప్రసాదించాలనుకున్నారో తెలియదుగాని, ఈశ్వరానందులవారు అతడిని దగ్గరికి పిలిపించుకున్నారు. అతని చేతికి
కొన్నిపుష్పాలిచ్చారు. "ఈపువ్వులు దేవుడిపైన వేసి. దేవుణ్ణి తాకి దండం
పెట్టుకొ" అన్నారు.
గణపతి సహాయంతో అలాగే చేశాడా భక్తుడు.  కళ్ళల్లో మెరుపు మెరిసినట్లనిపించింది. వెంటనే అతనికి చూపొచ్చేసింది. అతని ఆనందాన్ని,
అక్కడున్నవారి మానసిక శారీరక స్పందనల్ని మనమిక్కడ వర్ణించగలమా!
                 ఎక్కడ వినాయకుడు స్వయంభువుగా వెలువడ్డాడో అక్కడే ఉండాలి దేవుడు.మరి నీరూరుతున్నదిగా బావిలో? భక్తులసాయంతోమట్టితీసి ఇంచుమించు ఏటిమట్టానికి వేయించారు స్వామీజీ. ఇప్పుడు ఎక్కడ స్వామి
ఉద్భవించారో ఆస్థలానికి నేరుగా పైన స్థాపించారు దేవుణ్ణి. దేవుడిచుట్టూ నీరుబికినా ఉత్తరదిక్కుకు వెళ్ళే ఏర్పాటు చేసారు.
                అక్కడున్న భక్తులతో స్వామీజీ-
 "ఈ వినాయకస్వామి మహిమలు ఇప్పటికే మీరు చూశారు గదా.గణపతికి మాటరావడం, గజపతికి వినిపించడం, ఇతనికి కళ్ళు కనిపించడం, ఎంత అద్భుతం? అంతేకాదు, ఈభూమండలంలో ఎక్కడా లేనివిధంగా  ఈ వినాయకుడు పెరుగుతాడు.మీరు,మీముందుతరాలవారుదీన్నిచూడబోవడం సత్యం.కోరిన వరాలుతీర్చే  వినాయకుడుగనుక ఈస్వామి-
                                  వరసిద్ధి వినాయకుడు                                       అనే పేరుతో ప్రసిద్దికేక్కుతాడు" అని తనకున్న జ్ఞానంతో చెప్పారు.
                    ఆనోట ఈనోటా చుట్టుప్రక్కల గ్రామాల్లోకి పాకిపోయిందీ అద్భుత
వార్త. ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎన్ని కొబ్బరికాయలు?
ఎంతకర్పూరం? ఎన్ని సాబ్రానిపుల్లలు? ఎన్ని పుష్పాలు? ఏటికిరువైపులా
అందంగా విరబూసిన పూలన్నీ దేవుడిచెంతకుచేరి ధన్యమైనాయి. ధూపం
ఆప్రాంతపు ఆకాశాన్నంతా మబ్బులు కమ్మినట్లుంది. భగవంతుని కరుణామయ వీక్షణాలు భక్తులపై వీస్తున్నట్లు పుష్పపరిమళాలు. భక్తులు
సమర్పించిన కొబ్బరికాయల జలంతో ఒక కాణి నేల (పాతిక ఎకర) పారింది.
ఒకకాణి పారకం జరిగినందున ఆపుణ్యస్థలాన్ని "కాణిపారకం" అన్నారు.
కాలక్రమేణా కాణిపారకంలొ 'ర' మాయమై "కాణిపాకం'' గా ప్రసిద్ధి చెందినదీ
పుణ్యక్షేత్రం.
                  ఈవార్త స్థానిక ప్రభువులవారికి అందింది. ప్రభువు సంభ్రమా శ్చర్యాలతో సపరివారంగా బయలుదేరి కాణిపాకం చేరారు. బుజ్జి బొజ్జగణపతి
దర్శనం చేసుకున్నారు. ఈశ్వరానందులవారిద్వారా స్వామిమహిమలు తెలుసుకున్నారు. వెంటనే గుడి నిర్మించాలనుకున్నారు.
                 ఆలయనిర్మాణం ఒకశుభఘడియలో ప్రారంభింపబడింది. అనతి
కాలంలోనే ఆలయనిర్మాణం పూర్తికాబడి, వైభవోపేతంగా ప్రారంబించబడింది.
                 తను ముక్తి పొందడానికి ఇంతకన్నాగొప్ప పుణ్యస్థలం ఎక్కడున్నదని భావించిన ఈశ్వరానందులు తుదిశ్వాసవరకు వరసిద్ధివినాయకుని సేవించి తరించారు.
                  స్వామిని మనకందించిన పుణ్యసోదరులు గణపతి,గజపతి
గుడికి ఈశాన్యంలో మరోబావి త్రవ్వుకొన్నారు.(గుడి ఆవరణలో ఈశాన్యంలో ఈబావి ప్రస్తుతం ఉన్నది). వ్యవసాయం చేసుకుంటూ,భగవంతునికి, భక్తులకు సేవచేసుకుంటూ పునీతులైనారు.
          -------------------------------------------------------
                  కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామి క్రమంగా పెరుగుతున్నారు అనడానికి తార్కాణం -
 సుమారు అరవై సంవత్సరాల క్రితం అరగొండ గొల్లపల్లికి చెందిన శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ సిద్దయ్యనాయుడు దంపతులు స్వామివారికి చేయించిన వెండి
కవచం ప్రస్తుతం పట్టడంలేదు.ఈ కవచాన్నిగుడిలోకి ప్రవేసించునపుడు ధ్వజస్తంబం దాటిన తర్వాత మండపంలో మనం చూడవచ్చు. మేము బాల్యంలో చూస్తూ ఉండిన స్వామి ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నారు. నేను చిన్నప్పుడు అమాయకంగా "దేవుడిట్లా ఎంతకాలంపెరుగుతాడు" అని పెద్దలనెవరినో ప్రశ్నిస్తే వచ్చిన జవాబు నాకింకా బాగా గుర్తుంది. "దేవుడు పెరిగి పెరిగి పైకప్పుకు తగిలినప్పుడు కలియుగం అంతమయిపోతుంది" అని.
మరోఅద్భుతవిషయం ఏమిటంటే - దేవుడు వెలసిన బావిలో ఉబికే నీటినే
స్వామి సేవలకు వినియోగిస్తారు.
              కాణిపాకం ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు మధ్యవర్తుల అవసరం లేకుండా వివాదం పరిష్కరించుకుంటారు. కోనేటిలో స్నానంచేసి స్వామిముందు ప్రమాణం
చేసి పరిష్కరించుకుంటారు. తప్పుడు ప్రమాణం చేసినవారు శిక్షఅనుభవించి
తీరుతారని ప్రతీతి. 
--------------------------------------------------------
                    నాటి బుజ్జి బొజ్జయ్య పెరుగుతూ, భక్తుల్నిపెంచుకుంటూ 
నేటి పెద్దవినాయకుడై, వరసిద్ధి వినాయకుడుగా ప్రసిద్దివహించి, నిన్ను,నన్ను
మరెందరినో పావనం చేస్తున్నారు. మనమందరం ధన్యులం,పుణ్యులం, స్వామి దాసులం.
                       ఓం విఘ్నేశ్వరాయనమః

***************************************************